: ఎమ్మెల్యేలను రహస్య ప్రాంతానికి తరలించిన కాంగ్రెస్
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఎమ్మెల్సీ స్థానంలో నెగ్గి సత్తా చాటేందుకు పార్టీలన్నీ వ్యూహరచనలో మునిగిపోయాయి. ఆకర్ష్ పధకం ద్వారా టీఆర్ఎస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతుండగా... మరోపక్క టీడీపీ, బీజేపీలు వ్యూహరచన సాగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను చేజారకుండా కాపాడుకునేందుకు వారందరినీ రహస్య ప్రాంతానికి తరలించింది. తొలి ప్రాధాన్యత ఓటును ఆకుల లలితకు వేసి, ద్వితీయ ప్రాధాన్యత ఓటును వేరే వారికి వేయనున్నారు. టీడీపీ ప్రతిపాదన చేసినప్పటికీ, అంగీకరించని కాంగ్రెస్, టీఆర్ఎస్ కు వేసేందుకు మొగ్గుచూపుతోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎత్తులు పైఎత్తులతో పార్టీలు ఒక్క ఎమ్మెల్సీ స్థానం గెలుచుకునేందుకు తెరవెనుక సన్నాహాలు చేసుకుంటున్నాయి. కాగా, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ఆజాద్, వాయలార్ రవి నేడు హైదరాబాదు రానున్నారు. 18 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే తమ అభ్యర్థిని గెలిపించుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.