: మాధవరం బండారం త్వరలోనే బయటపెడతా: రేవంత్ రెడ్డి
తాజాగా టీఆర్ఎస్ లో చేరిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు టీఆర్ఎస్ ఇవ్వజూపిన తాయిలాల వివరాలు త్వరలోనే బయటపెడతానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఓ టీవీ ఛానెల్ చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము పార్టీలు మారిన నేతలను విమర్శించడం లేదని, అయితే వారు పార్టీ మారడానికి దారితీస్తున్న కారణాలను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ప్రజా శ్రేయస్సుకోసం ఎవరూ పార్టీలు మారడం లేదని, కేవలం టీఆర్ఎస్ పెట్టే ప్రలోభాలకు ఆశపడి పార్టీలు మారడం మాత్రం సరికాదని చెబుతున్నామని ఆయన వివరించారు. ఈ విధానం రాజకీయాలకు శుభసూచకం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత స్వార్థంతో పదవులు పొందేందుకు, సంపాదన వెనకేసుకునేందుకు పార్టీ మారడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే వ్యక్తిగత విమర్శలు కూడా సరికాదని ఆయన హితవు పలికారు. మాధవరంకు ఆశచూపిన తాయిలాలు ఏమిటన్నది త్వరలోనే బయటపెడతానని రేవంత్ రెడ్డి తెలిపారు.