: సహచరులను లెక్కచేయని మోదీ... భయపడుతున్న మంత్రులు: నిప్పులు చెరిగిన అంబికా సోనీ
పాలనాపరమైన విషయాల్లో సహచరులను, సంబంధిత మంత్రత్వ శాఖలను ఎంతమాత్రమూ సంప్రదించకుండానే మోదీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయనకు ఎదురుచెబితే ఏం జరుగుతుందోనన్న భయంలో మంత్రులున్నారని కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. యూపీఏ హయాంలో సోనియా గాంధీ అన్నీ తానై 'అదనపు రాజ్యాంగ శక్తి'గా పాలన సాగించారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి అంబికా సోనీ స్పందించారు. యూపీఏకు ఒక సమన్వయ కమిటీ, మరో సాధికార కమిటీలు ఉన్నాయని, ఏ నిర్ణయమైనా కమిటీల తరువాతే మంత్రివర్గంలో చర్చకు వచ్చాయన్న విషయాన్ని మోదీ గుర్తెరగాలని అన్న ఆమె, మోదీ సర్కారు ఇటువంటి వాటన్నింటినీ మూలన పారేసిందని విమర్శించారు. పదేళ్ల యూపీఏ పాలనలో అన్ని ప్రజాస్వామిక విధానాలనూ అమలు పరిచామని ఆమె తెలిపారు. "ఇప్పుడు ప్రతిరోజూ మంత్రులందరికీ విశ్రాంతే. మంత్రులు ప్రధాని అంటే భయపడిపోతున్నారు. ఆర్థికవేత్తలు సైతం ఇది ఒక మనిషి ప్రభుత్వం అంటున్నారు. అటువంటి వ్యక్తి అలా ఎలా మాట్లాడగలుగుతారు?" అని అంబికా సోనీ ప్రశ్నించారు. గత సంవత్సరం సెప్టెంబరులో న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ లో మోదీ ప్రసంగించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ సమయంలో విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జనాల్లో కూర్చొని ఉన్నారని, మోదీతో వేదికను పంచుకునే అవకాశం కూడా కేంద్ర మంత్రికి దక్కలేదని ఆమె విమర్శించారు.