: 'స్పెల్ బీ' టైటిల్ నెగ్గిన మనోళ్లు... అక్కసు చూపిన అమెరికన్లు!
వరుసగా ఎనిమిదో సంవత్సరమూ ప్రపంచ ప్రఖ్యాత ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీలో భారతీయ అమెరికన్ విద్యార్థులు విజేతలుగా నిలిచి చరిత్ర సృష్టించారు. మేరీల్యాండ్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన తుది పోటీలో కాన్సాస్ రాష్ట్రానికి చెందిన వన్య శివశంకర్ (13), మిస్సోరీ రాష్ట్రానికి చెందిన గోకుల్ వెంకటాచలం (14) సంయుక్త విజేతలుగా నిలిచారు. అంతేకాదు, ఈ పోటీల చరిత్రలో వరుసగా రెండోసారి సంయుక్త విజేతలుగా నిలిచిన వారుగానూ వీరిద్దరూ రికార్డు సృష్టించారు. వీరు ఒక్కొక్కరికీ, రూ. 23.60 లక్షల చొప్పున నగదు బహుమతి లభించనుంది. కాగా, వన్య శివశంకర్ 2009 స్పెల్ బీ పోటీ విజేత కావ్య సోదరి కావడం గమనార్హం. ఇదిలావుండగా, వరుసగా భారతీయుల సంతతి పిల్లలు విజయం సాధించడం అమెరికన్లకు ఎంత మాత్రమూ రుచించలేదు. పలువురు అమెరికన్లు సామాజిక మాధ్యమాల్లో వర్ణ వివక్ష వెళ్లగక్కారు. స్పెల్ బీ పోటీల నుంచి భారతీయులను తప్పించాలని డిమాండ్ చేశారు.