: కారు వదిలి, పరుగులు పెట్టిన మహిళా డాక్టర్... వెంబడించి పట్టుకున్న పోలీసులు!
మద్యం తాగి కారు నడపటమే కాకుండా, పోలీసులు చెక్ చేస్తున్నారని తెలిసి కారు వదిలి పరుగులు పెట్టిందో మహిళా వైద్యురాలు. ఈ ఘటన గత రాత్రి హైదరాబాదులోని జూబ్లీహిల్స్, రోడ్ నెంబర్ 45 దగ్గర జరిగింది. ఆమె పేరు డాక్టర్ మంజు. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవింగ్ పరీక్షల్లో భాగంగా పోలీసులు వాహనాలను ఆపి తనిఖీ చేస్తుండగా, ఈ డాక్టరు తన కారును పక్కన ఆపి పరుగెత్తడం చూసి పోలీసులు ఆమెను వెంబడించి పట్టుకున్నారు. ముందు పోలీసులను దబాయించిన డాక్టర్ మేడమ్, తన భర్తకు తెలిస్తే గొడవవుతుందని వాపోయారు. బ్రీత్ అనలైజర్ పరీక్షకు సహకరించకుండా కాసేపు మారాం చేసిన ఆమెను పోలీసులు వదల్లేదు. బ్రీత్ ఎనలైజర్ టెస్టులు నిర్వహించిన పోలీసులు ఆమె మోతాదుకు మించి మద్యం సేవించారని నిర్ధారించారు. కారును సీజ్ చేసి ఆమెపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మొత్తం 35 మంది మందుబాబులు దొరికిపోయారని, వారందరికీ చలాన్లు రాసి వాహనాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.