: సచిన్ కోసం వీరాభిమాని సుధీర్ ఏం తెచ్చాడో చూడండి!


భారత్ లో సచిన్ టెండూల్కర్ ను అభిమానించే వాళ్లు కోకొల్లలు. వారిలో సుధీర్ గౌతమ్ ప్రత్యేకమైన వ్యక్తి. సుధీర్ ఎవరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీవీలో టీమిండియా మ్యాచ్ లు వచ్చేటప్పుడు, ప్రేక్షకుల గ్యాలరీలో ఒంటిపై సచిన్ అన్న పేరుతో, ఓ వ్యక్తి బాడీ పెయింటింగ్ వేసుకుని, త్రివర్ణ పతాకం ఊపుతూ, శంఖం ఊదుతూ బిజీగా కనిపిస్తాడు. కాస్త బక్కపల్చగా ఉండే అతడే సుధీర్. ఆ సుధీర్ కు సచిన్ అంటే ప్రాణం. సచిన్ కూడా తన వీరాభిమానిగా సుధీర్ ను పేర్కొంటారు. ఇప్పుడా సుధీర్ తన గాడ్ క్రికెటర్ కోసం ఏం తెచ్చాడో చూడండి! భారత్ లో చాలా తక్కువగా లభ్యమయ్యే లిచీ ఫలాలను ముజఫర్ పూర్ నుంచి ముంబై తీసుకువచ్చాడు. 36 గంటల పాటు ప్రయాణం, 1875 కిలోమీటర్ల దూరం... అదీ జనరల్ బోగీలో ప్రయాణించి ముంబై చేరుకున్నాడు సుధీర్. అయితే, లిచీ పండ్లు మాత్రం ఏసీ త్రీటైర్ కోచ్ లో ప్రయాణించాయి. అదెలాగంటారా!... ఏసీ కోచ్ లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని బతిమాలి నాసిక్ దాకా, మరో వ్యక్తిని ప్రాధేయపడి ముంబై దాకా లిచీ ఫలాలను కాపాడుకున్నాడు. వేడికి అవి త్వరగా పాడైపోతాయి. అందుకే వాటిని నువ్వుల ఆకులు, బటర్ పేపర్లో భద్రపరిచి రెండు కార్టన్లలో సర్ది సచిన్ కోసం సిద్ధం చేశాడు. మొత్తం 1000 పండ్లవి. 12 ఏళ్లుగా ప్రతి ఏడాది ఇలాగే ఇస్తుంటాడు. ఇక, ముంబైలో రైలు దిగి నేరుగా సచిన్ ఇంటికి వెళ్లిన ఆ వీరాభిమానికి ఎవరూ అడ్డుచెప్పలేదు. బాగా తెలిసిన వ్యక్తి వస్తే ఎలా స్పందిస్తారో, సచిన్ భద్రతాసిబ్బంది అలానే వ్యవహరించారు. వెంటనే సుధీర్ ను లోపలికి పంపించారు. అందుకో కారణం ఉంది. ఓసారిలాగే సుధీర్ వస్తే... సెక్యూరిటీ వారు లోపలికి అనుమతించలేదట. దీంతో సచిన్... సుధీర్ ముందే భద్రత సిబ్బందికి, ఇంట్లో పనివాళ్లకు క్లాస్ తీసుకున్నాడు. అప్పటి నుంచి సుధీర్ వస్తే మాత్రం 'నో రెస్ట్రిక్షన్స్'. అభిమానులంటే అంతటి ఆప్యాయత కనబరుస్తాడు కాబట్టే వారు కూడా సచిన్ ను అంతలా ఆరాధిస్తారు. అన్నట్టు... ముంబై నుంచి తిరిగి తన స్వస్థలానికి వెళ్లిన తర్వాత సుధీర్ షెడ్యూల్ ఏంటో తెలుసా?.... మరో 1000 లిచీ ఫ్రూట్స్ ప్యాక్ చేసుకుని స్పిన్నర్ హర్భజన్ కు ఇవ్వడం, ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి టీమిండియా బంగ్లాదేశ్ టూర్ కోసం వీసా పొందడం, మళ్లీ ఇంటికి వచ్చి మరో 1000 లిచీలతో రాంచీ వెళ్లి ధోనీని కలవడం! ఆ తర్వాత కోల్ కతా వెళ్లి అక్కడి నుంచి బస్సులో ఢాకా వెళ్లడం... అక్కడ టీమిండియా ఆడే మ్యాచ్ లు చూసి తిరిగి భారత్ చేరుకోవడం... ఇప్పటికింతే మరి! మళ్లీ టీమిండియా సిరీస్ కు సిద్ధమైతే మనవాడూ రెడీ!

  • Loading...

More Telugu News