: కింకర్తవ్యం... రాహుల్ దాడితో ఆత్మరక్షణలో పడ్డ బీజేపీ!


ఆ 56 రోజులూ రాహుల్ గాంధీ ఎక్కడ గడిపి వచ్చాడో? ఏం చేశాడో? ఆ దేవుడికే తెలియాలి. కానీ, ఆ తరువాత రాహుల్ లో వచ్చిన మార్పు, ఫక్తు రాజకీయవేత్తగా వేస్తున్న అడుగులు అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. 'సూటు బూటు' సర్కారు అన్నా, 'మన్మోహన్ సింగ్ వద్ద ఆర్థిక పాఠాలు నేర్చుకున్న మోదీ' అన్నా, పార్లమెంటులో రైతుల పక్షాన నిలిచి తన గళాన్ని వినిపించినా, తనదైన శైలిలో పాదయాత్రలు చేసినా, నిరుపేద రైతుల ఇంట విశ్రమించినా, కేదార్ నాథ్ కు పాదయాత్ర చేసినా అన్నీ ఆయనలోని కొత్త ప్రత్యేకతలే. ఈ 'కొత్త రాహుల్' ధాటికి బీజేపీ ఆత్మరక్షణలో పడిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇకపై రాహుల్ తల్లి చాటు బిడ్డ కాబోడని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం నమ్ముతోంది. ఇదే ఇప్పుడు బీజేపీని ఇబ్బంది పెడుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే రాహుల్ ఇలా రెచ్చిపోతుండడాన్ని ఆ పార్టీ అస్సలు ఊహించివుండదు. బలహీనంగా ఉన్న విపక్షాలను సులువుగా నెగ్గుకు రావచ్చని తొలుత భావించిన పార్టీ, అది అంత సులభం కాదని ఇప్పుడు అర్థం చేసుకుంది. పూర్తిగా 'అప్ డేట్' అయిన రాహుల్ బీజేపీ ఆశలను నీరుగార్చాడు. అసలే తమ పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలతో పలుమార్లు ఇబ్బందులు పడ్డ బీజేపీ అగ్రనేతలకు ఇప్పుడు రాహుల్ ఏ క్షణం ఏ ఆరోపణతో దూసుకొస్తాడోనన్న ఆందోళనా నెలకొంది. రాహుల్ చేసే అన్ని విమర్శలకూ సూటిగా సమాధానం చెప్పలేక ప్రతి విమర్శలకే పరిమితమవుతోంది. రాహుల్ ఎంతగా బీజేపీ నేతలను రాజకీయంగా, వ్యక్తిగతంగా విమర్శిస్తారో, అంత త్వరగా ప్రజల్లోకి చేరగలుగుతారు. ఎందుకంటే, ఆయన విపక్ష నేత కాబట్టి! ఇక రాహుల్ ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే దేశవ్యాప్తంగా మోదీకి ప్రత్యామ్నాయ నేతగా రాహుల్ ఎదుగుదలకు మార్గం మరింత సుగమమవుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో లేని ఆ పార్టీకి ఇది చాలా లాభిస్తుందని రాజకీయ నిపుణులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి నిలిపేందుకు రాహుల్ ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? వాటి ఫలితం ఎలా ఉంటుంది? అన్న విషయాల్లో స్పష్టత రావాలంటే మరో నాలుగేళ్లు ఆగాల్సిందే.

  • Loading...

More Telugu News