: దొంగ నోట్లు కలిగివుంటే నేరస్తుడు కాదన్న బాంబే హైకోర్టు
కేవలం దొంగ నోట్లను కలిగివున్నంత మాత్రాన అతను నేరస్తుడని నిర్ధారించలేమని, తెలిసీ దొంగనోట్ల చెలామణికి పాల్పడుతున్నాడని నిరూపిస్తేనే శిక్షకు అర్హుడని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఓ నాలుగేళ్ల నాటి కేసులో, సెషన్స్ కోర్టు ఒక వ్యక్తికి విధించిన ఐదేళ్ల జైలు శిక్షను రద్దు చేసింది. వివరాల్లోకి వెళితే, 2011 డిసెంబర్ 19న ముంబై, కుర్లాలోని ఒక బ్యాంకులో మున్షీ మహ్మద్ అనే వ్యక్తి రూ. 9,500 చెల్లించేందుకు వెళ్లాడు. అందులో కొన్ని దొంగనోట్లు ఉన్నాయని అనుమానం వచ్చిన క్యాషియర్ నోట్లను చెక్ చేసుకునేందుకు వెళ్లి వచ్చేలోగా మున్షీ పరారయ్యాడు. దీంతో బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు మున్షీపై కేసు నమోదుకాగా, 2013లో ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో మున్షీ అపీలును విచారించిన హైకోర్టు తెలిసుండే దొంగనోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశాడని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని అభిప్రాయపడుతూ శిక్షను రద్దు చేసింది.