: కేసీఆర్ కు ఓ మహిళ సూటి ప్రశ్న
మీ ఇంట్లో ముగ్గురు మంత్రులుగా పదవులు వెలగబెట్టవచ్చా? మా ఇళ్లలో ఇద్దరు పింఛన్లకు అర్హులు కారా? అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓ మహిళ సూటి ప్రశ్న వేసింది. నిజామాబాద్ జిల్లా సిరికొండలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఏడో మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రసంగించేందుకు ప్రొఫెసర్ కోదండరాం లేవగానే బీడీ కార్మికులు ఆందోళన చేశారు. జీవనభృతి రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కొక్కరు మాట్లాడాలని ఆయన సూచించారు. దీంతో గడ్కోల్ గ్రామానికి చెందిన ఓ బీడీ కార్మికురాలు మాట్లాడుతూ, "కేసీఆర్ ఇంట్లో ముగ్గురికి పదవులు ఉండగా లేనిది, ఒకే ఇంట్లో ఇద్దరికి పింఛన్లు ఇస్తే ఏం పోతుంది" అని ప్రశ్నించింది. దీంతో ఆమెకు ఏం చెప్పాలో పాలుపోక కోదండరాం అలాగే నిలుచుండిపోవడం విశేషం.