: చంద్రబాబుపై పెద్ద కవిత చదివిన చిన్నారి హేమమాలిని
హైదరాబాదులోని గండిపేటలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో గురువారం ఓ బాలిక చంద్రబాబునాయుడుపై కవిత చదివి వినిపించింది. హేమమాలిని అనే ఈ చిన్నారి వినిపించిన కవిత అందరినీ ఆకట్టుకుంది. ఆ చిన్నారిని పార్టీ అధినేత చంద్రబాబు కూడా ప్రశంసించారు. తొలుత... తెలుగుజాతికి ముద్దుబిడ్డవు నీవురా భరతమాతకు రత్నమకుటమైనావురా ప్రజా చైతన్యమే నీకు తోడురా ప్రజల క్షేమమే నీకు బలమురా అన్నా ఓ చంద్రన్నా... మహిళల కోసమే నీ ఆరాటం వారి కోసమే నీ పోరాటం మహిళ మనసులో దాగి ఉంది మానవత్వం అదే నీకు సహకరిస్తుంది ప్రతి నిత్యం మహిళ లేనిదే లేదు లోకం తెలుగుదేశం లేనిదే తప్పదు మనకీ శోకం నీటి మీద రాత రాసే నాయకులు ఎందరో మా నుదుటి రాతను మార్చి రాసే నీ పేరు మా మనసులో కొలువుంటావు రైతు గుండెల్లో మన రాష్ట్రాన్ని ఉంచుతావు పసిడి పంటల్లో భాగ్యనగరాన్ని తీర్చి దిద్దావు హైటెక్ సిటీని మెరుగుపరిచావు ప్రజల కొరకు నీ సహాయం ప్రగతిపథమే నీ ధ్యేయం జన్మభూమితో ఆదుకున్నావు ప్రజల మనసులో నిలిచిపోయావు నాగలి పట్టే రైతన్నకు నేనున్నాంటూ నీకోసం నేనంటూ పయనిస్తావు నందమూరి పథంలో నిలిచిపోతావు ఎన్నటికీ నీవీ జగతిలో టీడీపీ కార్యకర్తలు నీ అడుగులో అడుగై కదిలివస్తారు నీకు అడుగడుగునా తోడవుతారు... అని పేర్కొంది. అనంతరం, చంద్రబాబు వెర్షన్ ను వినిపించింది. తల్లి కంట నీరు తుడిచి తనయుడౌతాను చెల్లి బాధ తీర్చు అన్ననౌతాను రైతన్నకు తోడుగ నేను ఉంటాను ఆడబిడ్డకు అండగ చేరువౌతాను నందమూరి ఆశయంతో కదలి వస్తాను సమస్యలన్నీ నేను పరిష్కరిస్తాను వస్తానులే నేను వస్తానులే సీమాంధ్రకు నేను వస్తానులే చేస్తానులే నేను చేస్తానులే స్వర్ణాంధ్రగ నిను చేస్తానులే... అంటూ ముగించి వేదిక దిగేందుకు వెళుతుండగా, చంద్రబాబు ఆమెను వెనక్కిపిలిచి ఫొటో తీయించుకున్నారు.