: అమితాబ్ ను చిక్కుల్లో పడేసిన 'కవిత'!
బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ ఓ కవితను షేర్ చేసుకుని సమస్యల్లో పడ్డారు. తాను రాసిన కవితను సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ద్వారా బిగ్ బీ షేర్ చేసుకున్నారంటూ డాక్టర్ జగ్బీర్ రాథీ అనే వ్యక్తి మండిపడుతున్నాడు. ఇందుకుగానూ అతను అమితాబ్ కు లీగల్ నోటీసు పంపి, రూ.కోటి నష్టపరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన నోటీసుకు స్పందించేందుకు బచ్చన్ కు సదరు వ్యక్తి 15 రోజుల సమయం ఇచ్చాడు. 2006లో తాను రాసిన ఓ కవితను సోషల్ మీడియాలో అమితాబ్ ను అనుసరిస్తున్న వికాస్ దూబే అనే వ్యక్తి ట్విట్టర్ పై షేర్ చేశాడని, తరువాత దాన్ని బిగ్ బీ తన ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల్లో షేర్ చేసుకున్నారని జగ్బీర్ చెప్పుకొచ్చాడు. దానిపై తాను అమితాబ్ తో మాట్లాడేందుకు ఓ సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నానని, కానీ కుదరలేదని అందుకే చివరగా తన లాయర్ ద్వారా నోటీస్ పంపినట్టు తెలిపారు.