: న్యాయ వ్యవస్థపై మరో మరక... కోర్టులో మోడలింగ్ ఆడిషన్స్ నిర్వహించిన గ్యాంగ్ స్టర్ ముస్తఫా


భారత న్యాయ వ్యవస్థపై మరో మరక పడింది. 1993 సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో విచారణను ఎదుర్కొంటున్న గ్యాంగ్ స్టర్ ముస్తఫా దోసా సెషన్స్ కోర్టు హాల్లో మోడలింగ్ ఆడిషన్స్ నిర్వహించడం సంచలనం సృష్టించింది. ఓ దుబాయ్ సంస్థకు మోడల్ ను ఎంపిక చేసేందుకు జైల్లోనే డీల్ ఒప్పుకున్న ఆయన ఎనిమిది మంది మోడళ్లను కోర్టు హాలుకు పిలిచి ఆడిషన్స్ చేశాడు. ఈ ఉదంతాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్, ఈ వ్యవహారంలో సంబంధమున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. ఆడిషన్స్ లో ఎంపికైన 19 సంవత్సరాల యువతి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెషన్స్ కోర్టుకు ఎనిమిది మందిని తీసుకెళ్లారని, ముగ్గురిని ఎంపిక చేశారని తెలిపింది. తమకు ముందు డబ్బులిచ్చారని, ఆపై పోలీసు వేషాల్లో వచ్చిన ఇద్దరు దుండగులు దాన్ని దోచుకుపోయారని ఆరోపించింది. కాగా, 1993 నాటి సీరియల్ పేలుళ్లలో 257 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దావూద్ ఇబ్రహీంతో పాటు టైగర్ మెమన్, మహమ్మద్ దోసాలు ఇప్పటికీ దొరకలేదు. ముస్తఫా దోసాను మాత్రం 2003లో అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News