: చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడ్డ లక్ష్మీపార్వతి
9 ఏళ్ల పాలనలో రైతుల జీవితాలను నాశనం చేసిన చంద్రబాబు... మరోసారి రైతుల ఉసురుపోసుకుంటున్నారని వైకాపా నాయకురాలు, దివంగత ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి మండిపడ్డారు. రాజధాని పేరుతో సింగపూర్ కు 10 వేల ఎకరాలను కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏమాత్రం అవగాహన లేని తన కుమారుడు లోకేష్ ను ప్రమోట్ చేయడానికి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లోకేష్ అమెరికాలో పర్యటించారని... ఏ హోదాలో ఆయన పర్యటించారని... ఏం సాధించారని మండిపడ్డారు. టీడీపీ నుంచి నందమూరి వంశాన్ని దూరం చేయడానికి యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఈరోజు ఎన్టీఆర్ 92వ జయంతి సందర్భంగా, ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.