: తండ్రి విడుదల కోరుతూ ముంబై నుంచి తిరుమలకు బాలిక ఒంటరి ప్రయాణం
ఓ కేసులో ఇరుక్కున్న తండ్రి జైలుకెళ్లడంతో, తిరుమలకు వెళ్లి శ్రీవెంకటేశ్వరుడిని మొక్కుకుంటే మేలు జరుగుతుందని భావించిన 13 ఏళ్ల చిన్నారి ఒంటరిగా తిరుమలకు వచ్చింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చిన బాలిక కాలినడకన కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో రైల్లో వెళ్తూ సొమ్మసిల్లి పడిపోయింది. ఒంగోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముంబైకి చెందిన విజయ విఠల్ కథమ్ పప్పుధాన్యాలు తయారు చేసే కంపెనీలో ఉద్యోగి. అక్కడ జరిగిన చిన్న గొడవలో విజయ విఠల్ జైలుకెళ్లాల్సి వచ్చింది. అతని కుమార్తె అక్షద తన పదేళ్ల వయసులో కుటుంబ సమేతంగా ఒకసారి తిరుమల సందర్శించింది. మరోసారి ఆ స్వామిని వేడుకుంటే తన తండ్రి బయటకు వస్తాడని నమ్మి నాలుగు రోజుల క్రితం తిరుపతికి వచ్చింది. కొండపై మూడు రోజులు ఉండి తిరుగు ప్రయాణంలో భాగంగా, ఎక్కాల్సిన రైలు బదులు మరో రైలులో ఎక్కి, ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషనులో దిగింది. నీరసంగా ఉండి ప్లాట్ ఫాంపై సొమ్మసిల్లిన స్థితిలో ఉన్న బాలికపై అనుమానం వచ్చిన రైల్వే పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అక్షదను ఒంగోలు బాలసదన్ లో చేర్చి, ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించారు.