: రాహుల్ ఢిల్లీలో మాట్లాడిందే... జగన్ గల్లీలో మాట్లాడుతున్నారు: పయ్యావుల కేశవ్
ఆర్థిక వనరులు లేనప్పటికీ, రాష్ట్రంలో ఎలాంటి లోటు లేకుండా పాలన సాగిస్తున్నామని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. ఉద్యోగులు మినహా మరేమీ లేని పరిస్థితుల్లో కూడా ప్రధాన హామీ అయిన రైతు రుణమాఫీని నెరవేర్చగలిగామని... వచ్చే నెలలో డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఉన్న పరిధిలో నూటికి నూరు శాతం పనిచేశామని అన్నారు. గండిపేటలోని మహానాడు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో వైకాపా అధినేత జగన్ పై ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఏది మాట్లాడితే, ఇక్కడ గల్లీల్లో జగన్ అదే మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ బాటను జగన్ వదల్లేదని అర్థం అవుతోందని ఎద్దేవా చేశారు. జగన్ కు 'సున్నా'కున్న విలువ తెలియదని... అందుకే టీడీపీ సంక్షేమ పథకాలకు సున్నా మార్కులు వేస్తున్నామన్నారని దుయ్యబట్టారు. ఆయన తమ పక్కన ఉంటేనే సున్నాకున్న విలువ తెలుస్తుందని సూచించారు. చంద్రబాబు పాలనలో క్రమశిక్షణకు ఎక్కువ విలువ ఉంటుందని... ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. యువనేత నారా లోకేష్ రాజకీయాల్లో తాను నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని, ఇప్పుడే తనకు బాధ్యతలు అవసరం లేదని చెబుతున్నారని... ఆయన ఆలోచనను తాము ఆహ్వానిస్తున్నామని... అయితే, పార్టీలో యువరక్తాన్ని నింపే క్రమంలో ఆయనకు కొన్ని బాధ్యతలు కట్టబెట్టాలని తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు.