: నేను కేవలం హిందూపురానికే పరిమితం కాదు... రాష్ట్రం మొత్తాన్ని చూసుకుంటా: బాలకృష్ణ
బడుగు, బలహీన వర్గాల ప్రజలను చేరదీసిన నేత దివంగత ఎన్టీఆర్ అని టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కొనియాడారు. చెన్నైకి కూడా నీరు అందించి అపర భగీరథుదిడిగా మన్ననలందుకున్న ఎన్టీఆర్... రాయసీమను కూడా సస్యశ్యామలం చేసేందుకు ఎంతో కృషి చేశారని చెప్పారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను ఏకం చేసి కాంగ్రెస్ ను అంతమొందించారని గుర్తుచేశారు. అనంతరం, ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు కూడా ఎన్టీఆర్ మార్గంలోనే నడుస్తున్నారని చెప్పారు. ఎన్నో సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించారని కీర్తించారు. వివిధ కార్యక్రమాలతో పేదల బతుకుల్లో వెలుగులు నింపిన నేత మన అధ్యక్షుడు అన్నారు. చంద్రబాబు పాలనలో పేదల పిల్లలకు కూడా విద్య చేరువైందని... దీంతో, వారు బాగా చదువుకుని, గొప్ప ఉద్యోగాలు చేసుకుంటున్నారని చెప్పారు. మహానాడులో ప్రసంగిస్తూ బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఆయువుపట్టు కార్యకర్తలేనని బాలయ్య చెప్పారు. ఈనాడు అత్యంత ఎక్కువ మంది కార్యకర్తలు గల పార్టీగా టీడీపీ అవతరించడం మన పార్టీ గొప్పదనమని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చంద్రబాబే బ్రాండ్ నేమ్ అని కొనియాడారు. ఆయన వల్లే అనేక దేశాలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని చెప్పారు. తనను అఖండ మెజార్టీతో గెలిపించిన హిందూపురం వాసులకు సర్వదా కృతజ్ఞుడనై ఉంటానని అన్నారు. అయితే, తాను కేవలం హిందూపురానికే పరిమితం కానని, రాష్ట్రం మొత్తానికి సేవలందిస్తానని తెలిపారు. తెలంగాణలో ఈసారి రాబోయే ఎన్నికల్లో టీడీపీ అఖండ మెజార్టీ సాధించి, అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.