: ఉచిత హనీమూన్, కుటుంబానికి వేతనం: యువతను ఆకర్షించేందుకు ఐఎస్ఐఎస్ కొత్త ఎత్తులు
తలలు తెగ్గోయడం, యుద్ధాలు చేస్తూ రక్తపు మరకల మధ్య నివాసం మినహా మరే విధమైన జీవితం ఉండదని తెలిసిపోవడంతో, ఐఎస్ఐఎస్ కు దూరం జరుగుతున్న యువతను ఆకర్షించేందుకు ఐఎస్ఐఎస్ కొత్త ఎత్తులు వేస్తోంది. యువతకు గాలం వేసేందుకు 1500 డాలర్ల (సుమారు లక్ష రూపాయలు) విలువైన ఉచిత హనీమూన్ ప్యాకేజీలను, కుటుంబాలకు వేతనాలను ఇస్తామని తాయిలాల ఆశ చూపుతోంది. ఈ విషయాన్ని అబూ బిలాల్ అల్-హోమ్సీ అనే పేరున్న ఐఎస్ఐఎస్ ఫైటర్ అసోసియేటెడ్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. తాను వివాహం చేసుకుంటే బోనస్ గా 1500 డాలర్లు ఇచ్చారని, దీంతో తన సహచరితో హనీమూన్ జరుపుకున్నానని తెలిపాడు. ఐఎస్ఐఎస్ ఆక్రమించుకున్న రక్కా పట్టణానికి చెందిన ఇతను ట్యునీషియాకు చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. తమది ప్రేమ వివాహమని తెలిపాడు. తమకో బిడ్డ పుడితే ఐఎస్ఐఎస్ 400 డాలర్లు ఇస్తుందని చెబుతున్నాడు. ప్రస్తుతం నెలకు తనకో 50 డాలర్లు, తన భార్యకో 50 డాలర్లు ఇస్తున్నారని, అలవెన్సుల రూపంలో నెలకు 65 డాలర్లు లభిస్తోందని తెలిపాడు. ఈ ఇంటర్వ్యూ తరువాత హోమ్సీ పురాతన నగరం పల్మైరాను కైవసం చేసుకునేందుకు కదిలిన ఫైటర్లతో జతకలిశాడట.