: లంక క్రికెట్ బోర్డులో 'సెక్స్ స్కాండల్' సంచలనం... ముగ్గురి తొలగింపు
శ్రీలంక క్రికెట్ బోర్డులో బయటపడ్డ 'సెక్స్ స్కాండల్' సంచలనం కలిగిస్తోంది. తమ లైంగిక అవసరాలు తీరిస్తేనే జట్టులో సభ్యులుగా కొనసాగుతారని మహిళా క్రికెటర్లను అధికారులు వేధింపులకు గురిచేసిన విషయం బయటకు పొక్కడంతో ముగ్గురు అధికారులను తక్షణం తొలగిస్తున్నట్టు లంక బోర్డు ప్రకటించింది. వీరిపై విచారణ జరిపిన తరువాతే చర్యలు తీసుకున్నామని, ఇద్దరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తేల్చామని, మరొకరి ప్రవర్తన సరిగ్గా లేదని గుర్తించామని శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ ముగ్గురికీ ఏ మహిళా క్రికెటర్ తోను శారీరక సంబంధాలు ఉన్నట్టు సాక్ష్యాలు లభించలేదని బోర్డు ప్రకటించింది. వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్టు లంక క్రీడామంత్రిత్వ శాఖ వెల్లడించింది. లైంగిక వేధింపుల ఆరోపణలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్టు తెలిపింది. ఈ ఉదంతాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఇదో సిగ్గుమాలిన చర్యని బాలల సంక్షేమ శాఖా మంత్రి రోజీ సేనానాయకే వ్యాఖ్యానించారు.