: తెలుగు రాష్ట్రాల్లో కూర'గాయాలు'!


మండుతున్న ఎండలకు దిగుబడి తగ్గడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. వారం పది రోజుల వ్యవధిలో టమోటా, బెండకాయలు, దొండ, వంకాయలు తదితరాల ధరలు రోజురోజుకూ పెరిగాయి. హైదరాబాదులో బహిరంగ మార్కెట్లో కిలో టమోటా ధర రూ. 40 దాటింది. మిగతా ముఖ్య కూరగాయల ధరలు రూ. 30 నుంచి రూ. 70 వరకూ పలుకుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్ల కింద సాగవుతున్న కూరగాయల పంటలు ఎండిపోయాయి. దీనికితోడు హైదరాబాదు చట్టుపక్కల జిల్లాల్లో టమోటా తదితర పంటల సాగు చివరి దశకు చేరుకోవడంతో దిగుబడి తగ్గిపోయింది. కొత్త పంటలు వేయాల్సిన సమయం వచ్చేసింది. దిగుబడి తగ్గడంతో, నగరంలోని హోల్ సేల్, రిటైల్ వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. ఇదే సమయంలో విజయవాడ రైతుబజారుకు రోజూ 2,500 క్వింటాళ్ల కూరగాయలు రావాల్సి వుండగా, ఎండల తీవ్రతకు అది 1800 క్వింటాళ్లకు పడిపోయింది. అన్ని జిల్లాల్లోని మార్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. మరో పది రోజుల పాటు కూరగాయల రాబడి ఇలాగే కొనసాగవచ్చని అంచనా. కాగా, ధరలకు కళ్లెం వేయాల్సిన మార్కెటింగ్ శాఖ, ధరల పెరుగుదల సర్వసాధారణమే అంటూ మిన్నకుంటోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడా కూరగాయలు సమృద్ధిగా దొరకవు కాబట్టి తామేమీ చేయలేమని అధికారులు అంటున్నారు. జూన్‌ లో వర్షాలు కురిస్తే కొత్తపంట వేస్తే, ఆపై మరో నెలన్నర నుంచి రెండు నెలల తరువాతే దిగుబడి చేతికందుతుంది. ఈ నేపథ్యంలో మరో రెండు నెలల వరకు కూరగాయల ధరలు ఒడిదుడుకుల మధ్యే ఉండవచ్చని అంచనా.

  • Loading...

More Telugu News