: 'చెత్త' ఘనతను సొంతం చేసుకున్న యువీ
ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు ఐపీఎల్-8 ఓ చేదు అనుభవంగా మిగిలిపోతుంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ ఈ స్టార్ ఆటగాడిని రూ.16 కోట్లు పోసి కొనుగోలు చేసింది. కానీ, తాజా సీజన్ లో యువీ 13 ఇన్నింగ్స్ లలో చేసింది 248 పరుగులే. సగటు 19.07. ఈ నేపథ్యంలో, ఐపీఎల్-8లో అత్యంత చెత్త ఆటగాడెవరన్న దానిపై నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో అత్యధికులు యువీకే ఓటేశారు. 'మోస్ట్ వేస్ట్ ప్లేయర్' గా పట్టం కట్టారు. ఇక, ఈ చెత్త జాబితాలో యువీ తర్వాత దినేశ్ కార్తీక్ నిలిచాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన కార్తీక్ ప్రదర్శన కూడా అంతంత మాత్రమే. ఈ తమిళనాడు ఆటగాడిని బెంగళూరు ఫ్రాంచైజీ రూ.10.5 కోట్లకు కొనుగోలు చేసింది. ధరకు తగిన న్యాయం చేయడంలో ఇతడూ విఫలమయ్యాడు. 11 ఇన్నింగ్స్ లాడి 12.81 సగటుతో 141 పరుగులు చేశాడు. దీంతో, వచ్చే ఐపీఎల్ లో వీరిద్దరిని ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవచ్చని క్రికెట్ పండితులు భావిస్తున్నారు.