: కూతురిలా పెంచుకున్న కుక్కకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ కుక్క చనిపోవడంతో విషాదంలో మునిగిపోయింది. అయితే, చనిపోయింది కుక్కే కదా అని భావించకుండా, దానిని తమ ఇంట్లో వ్యక్తిగా పరిగణించి హిందూ మతాచారాలను అనుసరించి కర్మకాండలు జరిపించారు. పప్పూ చౌహాన్ కుటుంబం ఓ జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఆడకుక్కకు పింకీ అని పేరు పెట్టి ప్రేమగా పెంచారు. చౌహాన్ కు ఇద్దరూ కుమారులే ఉండగా, పింకీని కుమార్తెలా భావించారు. అయితే, ఆ శునకానికి పక్షవాతం రావడంతో ప్రాణాలు విడిచింది. దీంతో, ఆ కుటుంబం ఇంట్లోని వ్యక్తి చనిపోయినట్టు బాధపడింది. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపించడమే గాకుండా, దశదిన కర్మ నిర్వహించి, అందరినీ పిలిచి భోజనాలు పెట్టారు. ఇప్పుడు ఇండోర్ లో దీని గురించే అందరూ చర్చించుకుంటున్నారు.