: ఆ పాప కిడ్నీల మాయంపై కదిలిన కేంద్రం
ఉత్తరప్రదేశ్ కు చెందిన బాలికకు ఆపరేషన్ నిర్వహించిన ఎయిమ్స్ వైద్యుడు 'రెండు కిడ్నీలు ఏమయ్యాయో తనకు సంబంధం లేద'న్న ఘటనపై కేంద్రం స్పందించింది. గత వారం యూపీలోని రాయ్ బరేలీకి చెందిన పవన్ కుమార్ కుమార్తె దీపికను (6) కిడ్నీ సమస్యతో ఢిల్లీలోని ఎయిమ్స్ కు తీసుకువచ్చారు. అక్కడ పలు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు, బాలిక ఎడమ కిడ్నీలో లోపం ఉందని, కుడి కిడ్నీ బాగానే పనిచేస్తోందని తెలిపారు. అంతే కాకుండా కుటుంబ సభ్యులు అంగీకరిస్తే చెడిపోయిన కిడ్నీ తొలిగిస్తామని చెప్పారు. ఎడమ కిడ్నీ తొలగించే క్రమంలోనే గత మార్చి 17న పిడియాట్రిక్ విభాగంలోని సీనియర్ సర్జన్ శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ తరువాత కూడా బాలికకు అదే సమస్య ఎదురు కావడంతో, స్థానిక వైద్యులను సంప్రదించగా, పరీక్షలకు సిఫారసు చేశారు. ఆ వైద్య పరీక్షల్లో ఆమె రెండు కిడ్నీలు కనబడలేదు. దీంతో దీపిక తల్లిదండ్రులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించిన సీనియర్ సర్జన్ ను నిలదీశారు. 'మీ అమ్మాయికి ఉన్నది ఒకే కిడ్నీ, దానిని నేను తీసేశా, అసలు పాపకి రెండు కిడ్నీలు లేనేలేవు' అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఈ కధనం జాతీయ మీడియాలో ప్రసారం కావడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా విచారణకు ఆదేశించారు.