: టీఆర్ఎస్ కు సవాల్ విసిరిన చంద్రబాబు
తెలంగాణ ఎప్పటి నుంచో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అంటూ కొందరు నేతలు అంటున్నారని... ఈ అంశంపై చర్చకు తాను సిద్ధమని... ఎవరు ఏమి చేశారో చర్చలో తేల్చుకుందాం రమ్ముంటూ టీఆర్ఎస్ కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. ప్రజలకోసం తెలంగాణను తాము అభివృద్ధి చేశామని... ఆ తృప్తి తమకు ఎప్పుడూ ఉంటుందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయాల్లో అవకాశం కల్పించింది టీడీపీనే అని అన్నారు. అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని... ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి కోసం పోరాటం చేస్తామని చెప్పారు. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన ఘనత టీడీపీకే దక్కిందని అన్నారు. టీడీపీని టీఆర్ఎస్ టార్గెట్ చేసిందని... పార్టీ ఎమ్మెల్యేలను బజారులో పశువుల్లా కొంటున్నారని మండిపడ్డారు. అయితే, ఒక నేత పోతే వంద మందిని తయారు చేసుకోగల సత్తా టీడీపీకి ఉందని చెప్పారు.