: మహానాడులో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ చంద్రబాబు


కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని... రాష్టాన్ని భ్రష్టు పట్టించారని మహానాడులో టీడీపీ అధినేత విరుచుకుపడ్డారు. జలయజ్ఞం పేరుతో కాంట్రాక్టర్లకు మేలు చేశారని... ప్రజలను ముంచేశారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని, రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాలేదని, దీంతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో మొదటి ఐదేళ్లు అవినీతిమయమైతే, తర్వాత ఐదేళ్లలో పూర్తిగా అనిశ్చితి నెలకొందని ఎద్దేవా చేశారు. పారిశ్రామికవేత్తలను కమిషన్ల కోసం వేధించారని, జైళ్లకు వెళ్లే పరిస్థితి కల్పించారని విమర్శించారు. అధికారులు సైతం జైలుకు వెళ్లేలా చేశారని అన్నారు. దివంగత ఎన్టీఆర్ హయాంలో కానీ, తన హయాంలో కానీ తాము ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని... రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించేలా చేశామని... కేవలం తమ వల్లే తెలంగాణలో మిగులు బడ్జెట్ వచ్చిందని స్పష్టం చేశారు. మహానాడులో ప్రారంభోపన్యాసం చేస్తూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొత్త ట్రెండ్ ఏదైనా సరే... దాన్ని సృష్టించగల సత్తా టీడీపీకే ఉందని అన్నారు. ఇప్పుడు ఆహార భద్రత గురించి మాట్లాడుతున్నారని... కానీ, 1983లోనే ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. రాష్ట్ర విభజన కూడా ఒక పద్ధతి, పాడు లేకుండా చేసి, ఇరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాశనం అయిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News