: మహాభారత కాలం నాటి మర్రిచెట్టు... కాపాడేందుకు గ్రీన్ ట్రైబ్యునల్ పోరు
ఆ మర్రిచెట్టు మహాభారత కాలం నాటిదని నమ్మకం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ చెట్టు కిందే భగవద్గీతను బోధించారని కూడా భక్తులు విశ్వసిస్తారు. ఈ చెట్టు వయసు సుమారు 5 వేల ఏళ్లు పైమాటేనని పరిశోధకులు సైతం తేల్చడంతో దీన్ని కాపాడేందుకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) నడుం బిగించింది. హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర సమీపంలోని జ్యోతిసర్ లో ఉన్న ఈ చెట్టు మాత్రమే మహాభారత కాలం నుంచి జీవించి ఉన్న ఏకైక ఆధారమని భావిస్తున్న ఎన్జీటీ, చెట్టు ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తూ, దాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను గురించి వివరించాలని కురుక్షేత్ర డిప్యూటీ కమిషనర్ కు నోటీసులు పంపింది. ఈ మర్రి చెట్టు నెమ్మదిగా అంతరిస్తోందంటూ ఇప్పటికే పలు ఎన్జీవో సంఘాలు కోర్టులను ఆశ్రయించి వున్నాయి. భక్తులు తమ కోరికలు తీరాలని ఆశిస్తూ, చెట్టుకు దారాలు కట్టడం, వివిధ రకాల గంటలను కొమ్మలకు వేలాడదీయడం చెట్టు ఎదుగుదలకు అడ్డంకిగా మారిందని వివరించారు. ఈ చెట్టును భావి తరాలకు అందించే చర్యలు చేపట్టాలని కోరారు.