: తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది మరణానికి కారణమిదే!
గడచిన వారం రోజుల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది వడదెబ్బ తగిలి మరణించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాదిన మరో రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ, ఇక్కడ మాత్రమే మరణాల సంఖ్య గణనీయంగా పెరగడానికి కారణాలను వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుఎంఓ) వెల్లడించింది. సూర్యరశ్మిలో అతి నీలలోహిత కిరణాల శాతం ప్రమాదకర స్థాయికి పెరగడమే ప్రజల మరణానికి కారణం. అల్ట్రా వయొలెట్ రేడియేషన్ 12 పాయింట్లుగా నమోదైందని డబ్ల్యుఎంఓ గణాంకాలు వెల్లడించాయి. దీన్ని 'డేంజర్ ఎక్స్ ట్రీమ్ రిస్క్'గా అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా 0 నుంచి 11 పాయింట్ల వరకూ యూవీ రేడియేషన్ విస్తరించి వుందని, దాన్ని దాటితే ప్రజల ప్రాణాలకు ప్రమాదమేనని తెలిపింది. యూవీ రేడియేషన్ 12 దాటితే, చర్మ సంబంధిత ఇబ్బందులతో పాటు వడదెబ్బకు అవకాశాలు పెరుగుతాయని వెల్లడించింది. ఈ వేడిలో 30 నుంచి 60 నిమిషాలు నిలబడితే, ఎవరికైనా చర్మంపై మంటపుట్టడం, వడదెబ్బ తగలడం జరుగుతుందని తెలిపింది. మరో వారం రోజుల వరకూ యూవీ కిరణాలు ఇదే తీవ్రతతో ఉండవచ్చని అంచనా వేసింది.