: ఆల్ టైం రికార్డు స్థాయికి బంగారం స్మగ్లింగ్
ఇండియాలోకి అక్రమంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2012-13లో సుమారు రూ. 100 కోట్ల విలువైన 350 కిలోల బంగారం కస్టమ్స్ అధికారులకు పట్టుబడగా, 2014-15లో ఏకంగా రూ. 1000 కోట్ల విలువైన 3,500 కిలోల బంగారం పట్టుబడింది. బంగారం విలువలో 10 శాతం మొత్తాన్ని దిగుమతి సుంకం రూపంలో చెల్లించాల్సి వుండటమే సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చేందుకు పురికొల్పుతోందని నిపుణులు వ్యాఖ్యానించారు. అందువల్లే రెండేళ్ల వ్యవధిలో బంగారం స్మగ్లింగ్ 900 శాతం పెరిగిందని వివరించారు. వాస్తవానికి మొత్తం స్మగ్లింగ్ అయిన బంగారంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నది కేవలం 10 శాతం వరకూ మాత్రమే ఉండవచ్చని అంచనా. దుబాయ్, థాయ్ లాండ్, చైనాల నుంచి నేపాల్ మీదుగా భారత్ కు ఎంతో బంగారం స్మగుల్ అయి వుండవచ్చని అంచనా. కస్టమ్స్ అధికారులు స్మగ్లింగును అరికట్టేందుకు ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నారో, అంతకన్నా ఎక్కువ వినూత్న పద్ధతుల్లో స్మగ్లర్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.