: స్మార్ట్ ఫోన్ బ్యాటరీతో ఇబ్బందులా? అయితే... మీకో శుభవార్త తెస్తున్న గూగుల్!
స్మార్ట్ ఫోన్ ను ఓ చేత్తో, చార్జర్ లేదా పవర్ బ్యాంకును మరో చేత్తో పట్టుకొని తిరగాల్సిన అగత్యం తప్పనుంది. బ్యాటరీ, రామ్ వాడకాలపై దృష్టిని సారించిన గూగుల్ తాము అభివృద్ధి చేసిన సరికొత్త సాంకేతికతను త్వరలో జరిగే గూగుల్ ఐఓ-2015 వార్షిక డెవలపర్ల సదస్సులో తొలిసారి పరిచయం చెయ్యనుంది. 'గూగుల్ ఆండ్రాయిడ్ ఎం' పేరిట డెవలపర్ ప్రీవ్యూ ఇవ్వాలని ఆ సంస్థ ఇప్పటికే నిర్ణయించింది. ఆండ్రాయిడ్ ఎల్, తదుపరి దశలో లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ గా మారినట్టు ఈ ఆండ్రాయిడ్ ఎంకు 'మార్ష్ మాలో' పేరు ఖరారవుతుందని తెలుస్తోంది. అక్టోబరులో విడుదలయ్యే నెక్సస్ స్మార్ట్ ఫోన్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందని గూగుల్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ప్రత్యేకత స్మార్ట్ ఫోన్లో ఎన్నడూ చూడనంత బ్యాటరీ బ్యాకప్. ఇదే సమయంలో రామ్ పనితీరు మరింత సమర్థవంతంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు ఫింగర్ ప్రింట్ ను గుర్తించి లాక్ ఓపెన్ అయ్యేలా కొత్త యాప్స్, సరికొత్త వాయిస్ యాక్సెస్, మరింత అభివృద్ధి చేసిన గూగుల్ వాయిస్ సెర్చ్, కొత్త క్రోమ్ కాస్ట్, ఫొటోస్ యాప్ తదితరాలను గూగుల్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.