: ఏడాది క్రితం మోదీని అడ్డుకున్న అధికారి... ఇప్పుడు మోదీ నిర్ణయాల అమలులో బిజీ!
దాదాపు ఓ సంవత్సరం క్రితం ఇప్పటి ప్రధాని, అప్పటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ నిర్వహించతలపెట్టిన ర్యాలీని అడ్డుకోవాలని ఆదేశాలు జారీ చేశాడా అధికారి. ఆయనే వారణాసి జిల్లా కలెక్టర్ ప్రాంజల్ యాదవ్. ఆ సమయంలో ఆయన ఆదేశాల పట్ల బీజేపీ తీవ్ర నిరసనలు తెలిపింది కూడా. కట్ చేస్తే... ఇక ఇప్పుడు 3 వేల సంవత్సరాల చరిత్రతో, మోదీ సొంత నియోజకవర్గంగా ఉన్న వారణాసి నగరాన్ని మోదీ ప్రణాళికల మేరకు అభివృద్ధి దిశగా నడిపించేందుకు ప్రాంజల్ పరుగులు పెడుతున్నారు. ఆనాటి ఘటనను గుర్తు చేసి, ప్రధానితో పని బంధాన్ని గురించి ప్రశ్నించగా, తమ మధ్య ఎన్నో సమావేశాలు జరిగాయని, ఏ నాడూ ర్యాలీపై నిషేధం విధించిన విషయం ప్రస్తావనకు రాలేదని ప్రాంజల్ వివరించారు. ఓ పార్లమెంటు సభ్యుడిగా ఖర్చు చెయ్యాల్సిన రూ. 5 కోట్ల ఎంపీ లాడ్స్ నిధుల వ్యవహారాలనూ తనకే అప్పగించారని ప్రాంజల్ తెలియజేశారు. వారణాసి పరిధిలోని ఐదు నియోజకవర్గాలకూ సమంగా ఆ నిధులను పంచారని పేర్కొన్నారు. కాగా, మే 2014లో ప్రధాని తలపెట్టిన ఓ ర్యాలీ నిర్వహణకు ప్రాంజల్ అనుమతించలేదు. ఆయన్ను తొలగించాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేసినా మోదీ అంగీకరించ లేదు. తనతో పాటు జపాన్ పర్యటనకూ ప్రాంజల్ ను తీసుకెళ్లారు. మోదీ నిర్ణయాలను అమలు చేసే పనిలో ఇప్పుడు ప్రాంజల్ బిజీ బిజీ!