: ఇప్పటికిప్పుడు తమ వల్ల కాదంటున్న ఉద్యోగులు!
తక్షణం నవ్యాంధ్ర రాజధాని ప్రాంతానికి ఉద్యోగులను తరలించాలన్న ఏపీ సర్కారు ఆలోచనలకు ఎప్పటికప్పుడు బ్రేక్ పడుతోంది. సరైన సౌకర్యాలు లేకుండా తాము రాలేమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. తన శాఖలోని 9 హెచ్‌వోడీలను విజయవాడకు తరలించాలని మంత్రి దేవినేని ఉమ అధికారులను ఆదేశించగా, ఆయన నిర్ణయాన్ని ఉద్యోగులు తప్పుబడుతున్నారు. ఎటువంటి మౌలిక వసతులు కల్పించకుండా, నూతన రాజధానికి వెళ్లమంటే ఎలా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇంత త్వరగా విజయవాడ వెళ్లలేమని వారు తేల్చిచెప్పారు. మంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, నేడు జలసౌధలో నిరసనకు పిలుపునిచ్చారు. అంతకుముందు మంత్రి ఆదేశాల మేరకు, జలవనరుల శాఖ పరిపాలనా విభాగం ఇంజనీరింగ్ చీఫ్ ఆగమేఘాలపై స్పందించి, తక్షణమే విజయవాడ వెళ్లేందుకు సిద్ధం కావాలని సర్క్యులర్ జారీ చేశారు. ఫైళ్లు, ఫర్నీచర్, ఇతర సామగ్రిని విజయవాడకు తరలించేందుకు ఎంత మంది మనుషులు అవసరమో అంచనా వేయాలని కూడా ఆదేశించారు. ఉన్నపళంగా వెళ్దామంటే, అక్కడ అద్దె ఇళ్ల నుంచి పిల్లల చదువుల వరకు ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.