: ఆ ముగ్గురి సేవలు ఎలా?: బీసీసీఐకి రాని స్పష్టత
భారత క్రికెట్ లో త్రిమూర్తులుగా, సమకాలీన దిగ్గజాలుగా పేరున్న సచిన్, గంగూలీ, ద్రవిడ్ ల సేవలను జట్టుకు ఏ విధంగా అందించాలన్న విషయంలో బీసీసీఐ ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. ముగ్గురిలో ఎవరికీ ఎవరూ తీసిపోరన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముగ్గురికీ కీలక బాధ్యతలే అప్పగిస్తారని అంచనా. ప్రస్తుతానికి కోచ్ ని ఎంపిక చేసే బాధ్యతను సలహా మండలికి అప్పగించింది. కోచ్ బాధ్యతలను ద్రవిడ్ లేదా గంగూలీకి అప్పగించవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే బెంగాల్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శిగా ఉన్న గంగూలీని పరిపాలనా పరంగా ఉపయోగించుకునేందుకే జగ్మోహన్ దాల్మియా మొగ్గు చూపుతున్నాడు. ప్రస్తుతానికి ఆయనకు కోచ్ పదవిని ఇచ్చినా, సమీప భవిష్యత్తులోనే గంగూలీకి హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ పదవి దక్కవచ్చని భోగట్టా. ఇక ద్రవిడ్ విషయానికి వస్తే, కోచ్ పదవి చేపట్టాలని ఇప్పటివరకూ తననెవరూ కోరలేదని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ద్రవిడ్ కు ప్రతిభాన్వేషణ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. సచిన్ కు సైతం, అతని స్థాయికి తగ్గట్టు ఎటువంటి పదవి ఇవ్వాలన్న విషయమై బీసీసీఐ గందరగోళంలోనే ఉంది.