: ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ కు తెలంగాణ ఉద్యోగుల సేవలు అందిస్తాం: మంత్రి కడియం
తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్ లో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ అనంతరం మంత్రి కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించుకునేందుకు స్థలం, డేటా కావాలని, టి.విద్యామండలిలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగుల సేవలు తమకే కావాలని ఏపీ మంత్రి కోరినట్టు చెప్పారు. ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం తమ ఉద్యోగుల సేవలు అందించేందుకు సిద్ధమని, కౌన్సెలింగ్ కు సహకరిస్తామని పేర్కొన్నారు. ఏపీ ఉన్నత విద్యామండలి ఫైళ్లు ఇవ్వడానికి కూడా అంగీకరించామన్నారు. వాటిపై తెలంగాణ నుంచి నలుగురు, ఏపీ నుంచి నలుగురు సభ్యులు ఓ కమిటీగా ఏర్పాటై ముందు ఫైళ్లను పరిశీలిస్తారని కడియం వివరించారు. చిన్న చిన్న సమస్యలను కలసి పరిష్కరించుకోవాలని కూడా నిర్ణయించామని పేర్కొన్నారు. అంతేగాక, ప్రతి విషయంలోనూ పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.