: విటులు లైంగిక నేరగాళ్లే... ఏడేళ్ల శిక్షకు అవకాశముందన్న హైకోర్టు


వ్యభిచారానికి పాల్పడి దొరికిపోయినా, ఏదో కాస్త జరిమానా కట్టేసి బయటపడదామనుకుంటే ఇకపై కుదరదు. బలవంతంగా వ్యభిచారం చేయాల్సి వస్తున్న యువతుల వద్దకు విటుల రూపంలో వెళ్తే వారు లైంగిక దాడి చేసినట్టేనని, వీరిని ఐపీసీ సెక్షన్ 370ఏ కింద విచారించి ఏడేళ్ల వరకూ శిక్షను విధించవచ్చని ఓ విటుడి కేసులో విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్ స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాదు పరిధిలోని ఓ అపార్టుమెంటులో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని, ఓ విటుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టగా, వ్యభిచారం ద్వారా వచ్చే సంపాదనతో జీవించేవారిపై మాత్రమే పీఐటీ సెక్షన్-4 వర్తిస్తుందని, ఈ సెక్షన్ తనకు వర్తించదు కాబట్టి కేసు కొట్టివేయాలని పట్టుబడ్డ విటుడు హైకోర్టును ఆశ్రయించాడు. దీన్ని విచారించిన కోర్టు సెక్షన్-4 పెట్టడం చెల్లనప్పటికీ, సెక్షన్ 370ఏ కింద కేసు పెట్టవచ్చని స్పష్టం చేశారు. కాగా, ఐపీసీ 370ఏ ప్రకారం బలవంతంగా వ్యభిచారంలోకి దిగిన వ్యక్తిపై లైంగిక దోపిడీకి పాల్పడితే విధించే శిక్షలను తెలియజేస్తుంది. దీని ప్రకారం యువతి మైనర్ అని తెలిసి కూడా వ్యభిచారానికి పాల్పడితే కనీసం ఐదేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు, మేజర్‌పై అయితే కనీసం మూడేళ్ల నుంచి గరిష్టంగా ఐదేళ్ల వరకూ జైలుశిక్షకు ఆస్కారముంటుంది. అయితే, ఇది సదరు యువతిని బలవంతంగా వ్యభిచారంలోకి దించిన సమయంలోనే వర్తిస్తుంది.

  • Loading...

More Telugu News