: దేశ ప్రజలకు మోదీ బహిరంగ లేఖ!


ప్రధానిగా తన పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా నరేంద్ర మోదీ భారత ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో గడచిన సంవత్సర కాలంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, సాధించిన విజయాల గురించి వివరించారు. 'నా ప్రియమైన దేశ ప్రజలారా...' అంటూ ప్రారంభమైన లేఖలో, కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రజలు, నిరుపేదలు, రైతులు, కార్మికులు తన కళ్లముందు కనిపిస్తారని, అందువల్లే జన్ ధన్, అటల్ పెన్షన్, ప్రధానమంత్రి జీవన జ్యోతి తదితర పథకాలు ప్రవేశ పెట్టానని తెలిపారు. అతివృష్టి, అనావృష్టి వల్ల ఇబ్బందులు పడుతున్న అన్నదాతకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని, తమ ప్రభుత్వం రైతుల పరిహారాన్ని ఒకటిన్నర రెట్లు పెంచిందని గుర్తు చేశారు. గతంలో బొగ్గు వంటి ప్రకృతి సంపదలు, స్పెక్ట్రమ్ పంపిణీ వంటి విషయాల్లో యథేచ్ఛగా వ్యవహరించారని, తాము పూర్తి పారదర్శకంగా వేలం విధానంలో కేటాయింపులు జరిపామని తెలిపారు. బొగ్గు గనుల వేలం ద్వారా రూ. 3 లక్షల కోట్లు, రేడియో తరంగాల వేలం ద్వారా రూ. 1 లక్ష కోట్లను ఖజానాకు చేర్చిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదేనని అన్నారు. 'మేకిన్ ఇండియా', 'స్కిల్ ఇండియా' వంటి పథకాల ద్వారా యువతకు మరింత మెరుగైన ఉపాధి అవకాశాలను దగ్గర చేశామని పేర్కొన్నారు. ముద్రా బ్యాంకు ఏర్పాటుతో చిన్న, మధ్యతరహా కంపెనీలకు రూ. 10 లక్షల వరకూ బ్యాంకు రుణాలను దగ్గర చేశామని వివరించారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న వారిని చట్టం ముందు నిలిపేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. స్వచ్ఛ భారత్ ముఖ్య లక్ష్యం ఆడపిల్లలు బహిర్భూమికి వెళ్లకుండా చూడటమేనని తెలిపిన ఆయన, పాఠశాలల్లో మరుగుదొడ్లు లేని కారణంగా చదువు మానుకునే పరిస్థితి ఇకపై తలెత్తరాదని అన్నారు. అందుకే 'ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి' అన్న నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు. గంగా నది శుద్ధి కోసం 'నమామి గంగ' ప్రారంభించామని, ప్రతి గ్రామాన్నీ 'డిజిటల్ కనెక్టివిటీ'లో భాగం చేస్తామని అన్నారు. దేశం ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది, ప్రజలు కలసిరావాలని కోరిన ఆయన 'మీ సేవకే అంకితం... జైహింద్' అంటూ ముగించారు.

  • Loading...

More Telugu News