: బ్యాంకు ఉద్యోగులకు బంపర్ బొనాంజా
దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న సుమారు 10 లక్షల మందికి పైగా బ్యాంకు ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపు రూపంలో 'బంపర్ బొనాంజా' లభించింది. వేతన పెంపును అంగీకరిస్తూ, భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ) 43 బ్యాంకులకు చెందిన 11 ఉద్యోగ, అధికారుల సంఘాలతో చేసుకున్న ఒప్పందంపై సంతకం చేసింది. వేతన పెంపు 2012 నవంబర్ 1 నుంచి వర్తిస్తుందని, దీనివల్ల రూ. 8,370 కోట్ల అదనపు భారం బ్యాంకులపై పడనుందని తెలుస్తోంది. మారిన వేతనాల ప్రకారం, ప్రస్తుతం రూ. 14,500 నుంచి రూ. 52,000 మధ్య ఉన్న నెలసరి వేతనం, ఇకపై రూ. 23,700 నుంచి రూ. 85,000 రూపాయలకు చేరనుంది. అలాగే నాన్-సబార్డినేట్ సిబ్బంది వేతనం ప్రస్తుతం రూ. 7,200 నుంచి రూ. 19,300 మధ్య ఉండగా, ఇకపై అది రూ. 11,765 నుంచి రూ. 31,540కు పెరుగుతుంది. సబార్డినేట్ సిబ్బంది కనీస జీతం ప్రస్తుతం రూ. 5,850 నుంచి రూ. 9,560కి చేరనుంది. జీతాల పెంపుతో పాటు ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాలను పూర్తి సెలవులుగా మార్చేందుకు సైతం ఐబిఎ అంగీకరించింది.