: 'ఏ బ్యూటిఫుల్ మైండ్' రియల్ హీరో ఇకలేరు!
'ఏ బ్యూటిఫుల్ మైండ్' సినిమాకు మూలమైన రియల్ హీరో, ప్రముఖ శాస్త్రవేత్త జాన్ నాష్ శనివారం మరణించారు. ప్రపంచ గణిత శాస్త్రానికి ఆయన సరికొత్త దిక్సూచిలాంటి వ్యక్తి అని శాస్త్రవేత్తలు పేర్కొంటారు. ఈ సినిమా 2002లో ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచి, నాలుగు అవార్డులు గెలుచుకుంది. ఒక దృశ్య రూపకంగా అలరించిన ఈ సినిమా వెనుక జాన్ నాష్ నిజజీవితం ఉంది. ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేసిన జాన్ నాష్ అంతర్గత సంఘర్షణకు గురయ్యారు. ఫలితంగా ఆయన మనోవైకల్యానికి గురయ్యారు. సుమారు పదేళ్లు పరిశోధనలకు దూరమైన ఆయన, తరువాత కోలుకుని గణిత శాస్త్రంలో అనితర సాధ్యమైన పరిష్కారాలు కనుగొని, నోబెల్ బహుమతి సాధించారు. మానసిక వ్యాధి సోకిన వారెవరైనా కోలుకోవడం చాలా కష్టం, అలాంటి పరిస్థితుల నుంచి కోలుకుని ఆయన సాధించిన విజయాలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. గేమ్ థియరీ, డిఫరెన్షియల్ జామెట్రీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్... వంటి అంశాలపై ఆయన చేసిన పరిశోధనలకు, గణిత శాస్త్రవేత్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు, జీవశాస్త్రవేత్తలు, మనో వైజ్ఞానిక శాస్త్రవేత్తలు నీరాజనాలు పట్టారు. ఐన్ స్టీన్ 'e=mc2' అని చెప్పినప్పుడు, డీఎన్ఏలో తంత్రులు కనిపెట్టినప్పుడు ఎంత సంచలనం కలిగిందో, జాన్ నాష్ థియరీలు కూడా అంతే సంచలనం రేపాయి. పరిశోధనలతో దూసుకుపోతున్నప్పుడు ఆయన మానసిక రోగం బారినపడ్డారు. దీంతో ఆయన నిరంతర ఘర్షణలో గడిపేవారు. ఎవరినీ గుర్తించేవారు కాదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ, ఎవేవో ఈక్వేషన్లు వల్లెవేస్తూ గడిపేవారు. నిద్రలేని రాత్రుల్లో తన గదిలో ఉన్న బోర్డు మీద ఈక్వేషన్లు వేస్తూ గడిపేవారు. అయితే అప్పటికే ఈ మెయిల్ సౌకర్యం ఉండడంతో, ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన గణితశాస్త్రవేత్తల గ్రూపుతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేవారు. అయితే ఆయన సంభాషణలు సరిగ్గా సాగేవికాదు. అయినప్పటికీ ఆయనతో వారు సంభాషణలు జరిపేవారు. ఈ క్రమంలో ఆయన నెమ్మదిగా కోలుకున్నారు. మానసిక వ్యాధి బారినపడ్డప్పటికీ ఆయన, తన సన్నిహితులను, మ్యాథ్స్ లోని ఈక్వేషన్స్ ను మర్చిపోకపోవడం విశేషం. ఆనతి కాలంలోనే ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేరి, సీనియర్ పరిశోధకుడిగా అర్హత సాధించారు. గణిత శాస్త్రంలో ఆయన చేసిన పరిశోధనలకు గాను, 1994లో గేమ్ థియరీ స్పెషలిస్టులు రీస్ హార్డ్ సెల్టన్, జాన్ హర్సన్వీలతో ఎకనామిక్ సైన్సెస్ లో చేసిన పరిశోధనలకు గాను నోబెల్ బహుమతిని పంచుకున్నారు. ఆయన చేసిన పరిశోధనలు, ఆర్థిక శాస్త్రం, కంప్యూటింగ్, ఇవల్యూషనరీ బయాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అకౌంట్స్, రాజకీయ ప్రవర్తన, సైనిక వ్యూహాలు వంటి రంగాల్లో ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇన్ని పరిశోధనలు చేసిన ఆయన, అమెరికాలోని ఓ ట్యాక్సీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ప్రమాదానికి గురై మే 23న శనివారం మృత్యువాత పడ్డారు. నార్వేలో ప్రతిష్ఠాత్మకమైన ఎబెల్ అవార్డు స్వీకరించేందుకు ఆదేశం వెళ్లారు. అక్కడ అవార్డు స్వీకరించి జాన్ నాష్ (86), ఆయన భార్య ఎలీషియా (82) తిరుగు ప్రయాణంలో న్యూజెర్సీ దగ్గర్లోని నెవార్క్ విమానాశ్రయం నుంచి ఇంటికి వస్తుండగా, వారి కారును ట్యాక్సీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన మృత్యువాత పడ్డారు. దీంతో ఏ బ్యూటిఫుల్ మైండ్ రియల్ హీరో కథ అంతమైంది. దీనిపై ఆ సినిమాలో జాన్ నాష్ పాత్ర పోషించిన రసెల్ క్రోవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు ట్వీట్ చేశారు. జాన్ నాష్ రెండు చేతులతోనూ ఒకే సమయంలో వేర్వేరు విషయాలను రాయగలగడం విశేషం.