: విభజన చట్టంలో ఉన్నవే చేస్తామని మోదీ ఆరోజు ఎందుకు చెప్పలేదు?: తులసిరెడ్డి


ప్రధాని నరేంద్ర మోదీపై ప్రముఖ రాజకీయనేత తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఓ టీవీ ఛానెల్ చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ, మోదీ ప్రధాన మంత్రి పదవిలో కంటే విదేశాంగ శాఖా మంత్రిగా బాగా రాణిస్తారని ఎద్దేవా చేశారు. సుష్మాస్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రి అనే విషయం మరచిపోయి, తానే విదేశాంగ మంత్రిగా ప్రధాని వ్యవహరిస్తున్నారని తులసిరెడ్డి దెప్పిపొడిచారు. ఏడాది మోదీ పాలన 'పావు కేజీ పిట్ట మాంసానికి ముప్పావు కేజీ మసాలా' అన్నట్టు సాగిందని ఆయన అన్నారు. మోదీ నెలకో పథకం పేరిట స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, టీమిండియా, జనధన్ యోజన అంటూ ఘనంగా ప్రారంభించడమైతే చేశారు కానీ, ఆయన ఏదీ బాధ్యతగా తీసుకోలేదని, ఆయా కార్యక్రమాలను బాధ్యతగా పూర్తి చేయడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో దేశం మొత్తం మీద వందల ప్రసంగాలు చేసిన మోదీ, అవేవీ తన ప్రసంగాలు కాదన్నట్టు ప్రవర్తిస్తున్నారని తులసిరెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కు చేసిన ప్రమాణాలు, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చేసినప్పుడు విభజన చట్టంలోని అంశాలను మాత్రమే నెరవేరుస్తామన్నారా? అని ప్రశ్నించారు. మోదీ మాటమీద నిలబడే మనిషి కాదని ఆయన స్పష్టం చేశారు. మోదీ పాలన 'మేడిపండు చూడ మేలిమై ఉండ పొట్టవిప్పి చూడ పురుగులుండ' అన్నట్టు ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News