: వీళ్లు రామారావు కంటే మగాళ్లా?... రాజశేఖరరెడ్డి కంటే మగాళ్లా?: సినీ నటుడు శివాజీ


ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో సినీ నటుడు శివాజీ తనదైన శైలిలో నిప్పులు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రానికి వచ్చి విభజన పట్ల వారి విచారాన్ని తెలియజేయాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదాపై అఖిలపక్షం వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్రం బాగుండాలంటే అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని అన్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం అఖిలపక్షం వేసేందుకు సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు చెప్పారని శివాజీ తెలిపారు. మరి ఈ విషయంపై చంద్రబాబు ఎందుకు వెనక్కు తగ్గుతున్నారో తెలియదని, తామందరం ఆయన వెనకుంటామని స్పష్టం చేసినా, ఆయన ముందుకెళ్లడం లేదని విమర్శించారు. ఇప్పుడున్న మంత్రులందరూ మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్లేనని, వాళ్ల తాతలేమీ జమిందార్లు కాదని అన్నారు. జీవితం అనిశ్చితితో కూడుకున్నదని, ఎప్పుడు ఎవరుంటారో చెప్పలేమని అన్నారు. వీళ్లంతా రామారావు కన్నా మగాళ్లా?... రాజశేఖరరెడ్డి కన్నా మగాళ్లా? అని ప్రశ్నించారు. 'ఎవరో ఓ పెద్దమనిషి ఎక్కువ మాట్లాడుతున్నాడు?' అని తననుద్దేశించి కామెంట్ చేసినట్టు తెలిసిందని, ముందుముందు ఇంతకంటే వందరెట్లు ఎక్కువ మాట్లాడతానని హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఇచ్చేవరకు తానింతేనని స్పష్టం చేశారు. "ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత నేను కనిపిస్తే అప్పుడడగండి. ఏ ఏరియాలోను కూడా కనపడను. అవసరమైతే ఈ దేశంలో కూడా కనపడను. వస్తే ప్రత్యేక హోదా, పోతే ప్రాణం... వీటన్నంటికి తెగించి, సిద్ధపడే వచ్చాను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి" అని అన్నారు.

  • Loading...

More Telugu News