: కొత్త అవతారం ఎత్తనున్న సౌరబ్ గంగూలీ!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సరికొత్త అవతారంలో తిరిగి మరోసారి జట్టుతో చేరనున్నారా? అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు విదేశీ గడ్డలపై ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన అపార అనుభవాన్ని తదుపరి క్రికెట్ తరానికి పంచేందుకు టీం డైరెక్టర్ లేదా హై పెర్ఫార్మెన్స్ మేనేజరుగా నియమించవచ్చని తెలుస్తోంది. బంగ్లాదేశ్ తో టీమిండియా కొత్త సీజన్ ప్రారంభానికి ముందే ఈ విషయమై నిర్ణయం వెలువడవచ్చని సమాచారం. క్రికెట్ జట్టు అంతర్జాతీయ రికార్డును మరింత పటిష్ఠపరచుకునే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్న బీసీసీఐ ఉన్నతాధికారులు జట్టు మేనేజ్ మెంట్ అధికారులను మార్చవచ్చని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో గంగూలీ నియామకంపై స్పష్టత రావచ్చు.