: కింగ్ ఫిషర్ కు ఇచ్చిన అప్పు తిరిగొస్తుందన్న నమ్మకం లేదు: యునైటెడ్ బ్యాంక్
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆధ్వర్యంలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు గతంలో ఇచ్చిన రుణాలు తిరిగి వెనక్కు వస్తాయన్న ఆశలేదని ప్రభుత్వ రంగ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కింగ్ ఫిషర్ కు మొత్తం 17 బ్యాంకులు రుణాలివ్వగా, డీఫాల్టర్ జాబితాలో చేర్చిన తొలి బ్యాంకుగా యునైటెడ్ బ్యాంకు నిలిచింది. బ్యాంకు డీఫాల్టర్ల జాబితాలో మాల్యా, యూబీ గ్రూప్ పేర్లను చేర్చింది. కాగా, దీనిపై మండిపడ్డ మాల్యా డీఫాల్టర్ ట్యాగ్ ను కోర్టులో సవాలు చేయనున్నట్టు సమాచారం. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు మొత్తం రూ. 7,500 కోట్ల మేరకు బ్యాంకులు రుణాలివ్వగా, కేవలం రూ. 1000 కోట్లు మాత్రమే వెనక్కు వచ్చాయి. గ్రూపు కంపెనీల వాటాలను ఫిబ్రవరి 2013లో తాకట్టు పెట్టడం ద్వారా రుణాలను యూబీ గ్రూపు రీకాల్ చేసుకుంది. "మాకు ఎంతమాత్రమూ ఆశల్లేవు. కింగ్ ఫిషర్ నుంచి ఒక్క పైసా వచ్చే సూచనలు కనిపించడం లేదు. ముంబైలోని సంస్థ భవనాన్ని విక్రయించడ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు మాత్రం వస్తాయి" అని యునైటెడ్ బ్యాంక్ సీఈఓ పీ శ్రీనివాస్ వెల్లడించారు. మొత్తం రుణ మొత్తాన్ని చూస్తే, తాము రికవరీ చేసేది వడ్డీకి మాత్రమే సరిపోతుందని ఆయన తెలిపారు.