: చెన్నైకి 'మూడ్' రానివ్వని ముంబై!
ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ టైటిలును ఎగరేసుకుపోవాలన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కలను ముంబై చెరిపేసింది. ఐపీఎల్ పోరులో ఆరోసారి ఫైనలుకు చేరిన ఏకైక జట్టుగా ఉన్న చెన్నైలో డ్వేన్ స్మిత్, రైనా, ధోనీ వంటి హిట్టర్లున్నా ముంబై ముందు నిలువలేకపోయారు. టాస్ గెలిచి ప్రత్యర్థి జట్టుకు ధోనీ బ్యాటింగ్ అప్పగించి పెద్ద పొరపాటే చేశాడు. రెండో ఓవర్లో మొదలైన ముంబై బాదుడు చివరి వరకూ కొనసాగగా, నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. లెండిల్ సిమన్స్ 68, రోహిత్ శర్మ 50 పరుగులతో అర్ధ సెంచరీలు సాధించగా, కీరన్ పొలార్డ్ 36, అంబటి రాయుడు 36 (నాటౌట్)తో జట్టు స్కోరుని రెండొందలు దాటించారు.203 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై చతికిలపడింది. 161 పరుగులతో సరిపెట్టుకుంది. దీంతో ముంబై 41 పరుగుల తేడాతో విజయం సాధించినట్లయింది.