: 2025 నాటికి భారత్ లో మంచి నీటికి తిప్పలే
2025 నాటికి భారత్ లో మంచినీటికి కటకట తప్పదని ఈఏ వాటర్ నివేదిక తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా నీటికి కటకటలాడే దేశాల్లో భారత్ కూడా ఒకటని ఆ నివేదిక స్పష్టం చేసింది. భారత దేశంలో 70 శాతం వ్యవసాయ, 80 శాతం గృహావసరాలకు భూగర్భ జలాలే ఆధారం. దీంతో నీటి వినియోగం, లభ్యతల్లో హెచ్చుతగ్గుల వల్ల తీవ్ర నీటి కొరత భారత్ ను పీడించనుందని ఈఏ వాటర్ నివేదిక వెల్లడించింది. వ్యక్తిగత ఆదాయం పెరగడం, దేశీయ పారిశ్రామిక రంగం పెరగడం కూడా అధిక నీటి వినియోగానికి కారణాలుగా ఆ నివేదిక పేర్కొంది. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుందని ఆ నివేదిక స్పష్టం చేసింది. దీంతో, బెల్జియం, అమెరికా, ఇజ్రాయెల్, కెనడా, జర్మనీ దేశాలకు చెందిన సంస్థలు దేశీయ జలరంగంలో 1300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. రానున్న మూడేళ్లలో 1800 కోట్ల రూపాయల పెట్టుబడులు దేశానికి రానున్నాయని, ఇప్పటికే ఆయా సంస్థలు ముంబైలో పనులు ప్రారంభించాయని ఆ నివేదిక వెల్లడించింది.