: మీ హోటల్ ని మీరు మడతపెట్టి తీసుకెళ్లిపోండి...!
సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత కాలంలో ఏదీ అసాధ్యం కాదు. సాధారణంగా మనం ఏదయినా కొత్త ప్రదేశానికి వెళ్తే, అక్కడ సౌకర్యవంతంగా, శుచి శుభ్రంగా ఉండే హోటల్ దొరుకుతుందో లేదో అనే అనుమానం పీడిస్తుంటుంది. ఇకపై అలాంటి చింత అక్కర్లేదంటోంది డచ్ సంస్థ. బాత్ రూం సహా మీ హోటల్ ని హ్యాపీగా మడత పెట్టి పట్టుకుపోయే 'ఫ్లెక్సోటెల్' అనే నిర్మాణాన్ని ఆ సంస్థ కనిపెట్టింది. ఈ ఫ్లెక్సోటెల్ గదులను మడతపెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు. ఈ గదులను కేవలం పది నిమిషాల్లోనే తయారు (అసెంబుల్)) చేయవచ్చు. ఒక్కో గదిలో ఇద్దరు నిద్రపోవచ్చు. విద్యుత్, వెలుతురు, ఫర్నిచర్ ఉంటాయి. ఇష్టమైన రీతిలో బాత్రూం నిర్మించుకోవచ్చు. ఇందులో షవర్ కూడా ఉంటుంది. ఒక్కో లారీలో 20 ఫ్లెక్సోటెల్ గదులను మడతపెట్టి తీసుకెళ్లిపోవచ్చని దీని తయారీదారులు తెలిపారు. మరుగుదొడ్డి ఉండే వాటిని కంఫోటెల్స్ అంటారు. ఇవి సాధారణ, అప్ గ్రేడెడ్ వెర్షన్లలో దొరుకుతాయి. అప్ గ్రేడెడ్ వెర్షన్లలో వేడినీటి సౌకర్యం కూడా ఉంటుంది.