: భారత విపణిలో సోలార్ స్కూటర్...ఒకసారి చార్జ్ అయితే 50 కి. మీ. వెళ్లచ్చు!
పెట్రోలు, డీజిల్ ధరలు చుక్కలనంటుతున్నాయి. భవిష్యత్ లో అవి తగ్గే అవకాశాలు కనబడడం లేదు. దీంతో, దేశీయ ఇంధన అవసరాలు తీర్చేందుకు ఈటీఐ డైనమిక్స్ సంస్థ నడుం బిగించింది. భారత వాహన విపణిలోకి సోలార్ ద్విచక్రవాహనాన్ని విడుదల చేసింది. ఈ సోలార్ హైబ్రీడ్ స్కూటర్ గంటకు 45 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. బ్యాటరీ ఒకసారి పూర్తిగా ఛార్జ్ అయితే దానితో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు, అలాగే ప్రయాణంలో కూడా ఇది చార్జ్ అవుతుంది. సోలార్ మొబైల్ ఛార్జింగ్ సాంకేతికత ఇందులో వినియోగించినట్టు ఈటీఐ డైనమిక్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్ వాద్వా తెలిపారు. దీనికి పైకప్పుగా సోలార్ ప్యానెళ్లు బిగించారు. దీనిలో లోపాలు సరిచేసి, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆటోలు, రిక్షాలు, బస్సులకు విస్తరించనున్నట్టు తెలిపారు. ఎండలు మండిపోతుండడంతో సోలార్ స్కూటర్లు క్లిక్ అవుతాయని నిపుణులు భావిస్తున్నారు.