: ప్రత్యేక హోదాలో వచ్చే నిధుల కంటే ఏపీకి ఎక్కువే ఇస్తాం: జైట్లీ భరోసా
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం, రావడం కల్లేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాటల ద్వారా మరోసారి స్పష్టమైంది. ఈ మేరకు ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఏపీ పునర్విభజన చట్టంలోని చాలా హామీలు అమలు చేశామన్నారు. అందులోని మరికొన్ని హామీలను అమలు చేసే పనిలో ఉన్నామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో హామీ ఉందని, అదనపు నిధులు ఇస్తున్నందున ప్రత్యేక హోదా అంశాన్ని 14వ ఆర్థిక సంఘం పేర్కొనలేదన్నారు. ప్రస్తుతం ఈ సమస్యను ఎలా పరిష్కరించాలన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని జైట్లీ పేర్కొన్నారు. అయితే హైదరాబాద్ ను కోల్పోయిన ఏపీకి తగిన వనరులు ఉండేలా చేస్తామని, ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా కింద వచ్చే నిధుల కంటే రాష్ట్రానికి ఎక్కువ నిధులే ఇస్తామని భరోసా కల్పించారు.