: వేల ఏళ్ల క్రితమే మనిషిని చూసి తోకలు ఊపాయి!
మనిషికి నమ్మకమైన నేస్తాలుగా శునకాలను పేర్కొంటారు. వాటిని విశ్వాసానికి మారుపేరుగా అభివర్ణిస్తారు కూడా. తాజాగా, కుక్కలు ఎప్పుడు మనిషికి మచ్చికయ్యాయన్న దానిపై శాస్త్రవేత్తలు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 27,000 ఏళ్ల నుంచి 40,000 ఏళ్ల క్రితమే మనిషి వాటిని మచ్చిక చేసుకుని ఉంటాడని స్వీడన్ పరిశోధకులు అంటున్నారు. సైబీరియా ప్రాంతంలో దొరికిన ఓ కుక్క దవడ ముక్కను పరిశీలించి, విశ్లేషణ జరిపిన అనంతరం వారు ఈ అంచనాకు వచ్చారు. శునకాలు మంచు యుగం తర్వాత తమ పూర్వీకులైన తోడేళ్ల జాతి నుంచి విడవడి, 16000 ఏళ్ల క్రితం మనిషికి మాలిమి అయ్యాయని గత అంచనాలు చెబుతున్నాయి. దీనిపై, స్వీడిష్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి చెందిన లవ్ డాలెన్ మాట్లాడుతూ... అందరూ అనుకుంటున్న దానికంటే ఎంతో ముందుగానే శునకాలు మనిషికి మచ్చిక అయి ఉంటాయని అభిప్రాయపడ్డారు.