: ఈఫిల్ టవర్ సందర్శకులారా... మీ జేబులు జాగ్రత్త!
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో కొలువై ఉన్న ఈఫిల్ టవర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాల్లో ఒకటి. ఏడాది పొడవునా ఈ భారీ నిర్మాణం సందర్శకులకు తెరిచే ఉంటుంది. ఏదన్నా బాంబు బెదిరింపో, నిరసనల సందర్భంగానో తప్ప ఇది మూతపడడం అరుదు. కానీ, శుక్రవారం నాడు మాత్రం ఇది మూతపడింది. ఎందుకో తెలుసా?... ఈఫిల్ టవర్ వద్ద పిక్ పాకెటింగ్ ఎక్కువైపోయిందంటూ సిబ్బంది నిరసన చేపట్టారు. జేబు దొంగలు స్వైర విహారం చేస్తున్నారని వారు ఆందోళన వెలిబుచ్చారు. టవర్ నిర్వహణ సంస్థ దీనిపై మాట్లాడుతూ, సమస్యపై పోలీసు విభాగంతో చర్చిస్తున్నామని, త్వరలోనే ఈ చారిత్రక కట్టడం తెరుచుకుంటుందని తెలిపింది. కాగా, క్రైమ్ రేటు తగ్గుముఖం పట్టిందని, పోలీసు గస్తీ, వీడియో నిఘా ఫలితాలనిచ్చాయని పారిస్ అధికారవర్గాలు ప్రకటించిన మరుసటి రోజే ఈఫిల్ టవర్ సిబ్బంది నిరసన ప్రదర్శనకు దిగడం గమనార్హం.