: జూన్ 2న ఏపీలో నవనిర్మాణ దీక్ష చేయాలని ప్రభుత్వ నిర్ణయం
జూన్ 2న ఉత్సవాలు నిర్వహించడం లేదని, నవనిర్మాణ దీక్ష చేపట్టబోతున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 6వ తరగతి విద్యార్థుల నుంచి ఉపాధ్యాయులు సహా అందరూ తప్పనిసరిగా దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలు పునరంకితమయ్యేలా స్పూర్తినిచ్చేందుకే ఈ దీక్ష చేపడుతున్నట్టు సీఎం తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు సచివాలయంలో కలెక్టర్లతో సమావేశమై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన ప్రభావం ఏపీ ప్రజలపై తీవ్రంగా ఉందని, రాష్ట్ర విభజన తంతును అరగంటలో ముగించారని వ్యాఖ్యానించారు. రాజధాని ఎంపిక పేరుతో శివరామకృష్ణన్ కమిటీ వేసి మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలనుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం మనకు సహకరించే పరిస్థితి కనిపించడం లేదని, రెచ్చగొట్టే ధోరణి వారిలో కనిపిస్తోందని ఈ సందర్భంగా బాబు అన్నారు.