: బెంగళూరుపై గర్జించకుంటే అంతే సంగతులు: కింగ్స్ కు స్టీఫెన్ ఫ్లెమింగ్ సలహా
నేటి రాత్రి జరిగే కీలక పోరులో గెలిచి ముంబైతో ఫైనల్ మ్యాచ్ ఆడాలంటే చెన్నై జట్టులోని టాప్ ఆర్డర్ ఆటగాళ్లు రాణించాల్సి వుందని జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సలహా ఇచ్చాడు. బెంగళూరుపై టాప్ ఆర్డర్ గర్జించకుంటే అంతే సంగతులని ఆయన అన్నాడు. జట్టు సభ్యులంతా కలసికట్టుగా రాణించి సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చాడు. "గత ఐపీఎల్ పోటీలతో పోలిస్తే ఈసారి మా ఆటగాళ్లు సరైన రీతిలో రాణించలేదు. ఎక్కువ వికెట్లనూ కోల్పోయాము. ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులను టాప్ ఫైవ్ ఆటగాళ్లు సాధిస్తేనే విజయం సులువవుతుంది" అని ఆయన అభిప్రాయపడ్డాడు. మంచి ఆటగాళ్లున్నా, టాప్ ఆర్డర్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించిందని ఆయన అన్నాడు. మెక్ కల్లమ్ మినహా మరెవరూ రాణించలేదని, నేటి మ్యాచ్ లో ఆ పరిస్థితి మారాలని సలహా ఇచ్చాడు.