: రెండు సెంట్ల భూమి కోసం తనయుడి కిరాతకం
కేవలం రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని రాసివ్వడం లేదన్న ఆగ్రహంతో కన్న తండ్రినే చంపేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చుండూరు పరిధిలోని దుండిపాలెంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, దుండిపాలెంకు చెందిన పులుగు వెంకటరెడ్డి (55) మిల్లులో కూలీగా పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు శ్రీనివాసరెడ్డి వ్యసనాలకు బానిసై తన నాయనమ్మ పేరున ఉన్న రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని తనకు రాసివ్వాలంటూ కొంతకాలంగా వెంకటరెడ్డిపై ఒత్తిడి తెస్తున్నాడు. రాసిస్తే దాన్ని కూడా పాడుచేస్తాడన్న భావంతో వెంకటరెడ్డి నిరాకరించాడు. ఈ నేపథ్యంలో ఆరు బయట నిద్రిస్తున్న తండ్రి తలపై రోకలి బండతో బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా తండ్రి గుండెలపై కూర్చొని పీక నొక్కాడు. ఎవరో వస్తున్నారని చూసి అక్కడి నుంచి పారిపోయాడు. కొన ఊపిరితో ఉన్న వెంకటరెడ్డిని ఆసుపత్రికి తరలించగా, ఆయన మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.